సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలు ఓ వైపు ఆటపాలతో ఎంజాయ్ చేస్తూ.. మరొక వైపు తినుబండారాలను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పిల్లలు సహజంగానే జంక్ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సెలవుల్లో వారు అతిగా జంక్ ఫుడ్ తినేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక అలాంటి అలవాటును పెద్దలు మాన్పించాలి. అందుకు గాను పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన తినుబండారాలను పెద్దలే వారికి చేసి పెట్టాలి. అలాంటి తినుబండారాల్లో కొబ్బరి లడ్డు కూడా ఒకటి. ఈ లడ్డూలలో అనేక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:
తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు, పాలు – 1/2 కప్పు, చక్కెర – 3/4 కప్పు, యాలకుల పొడి – 1/4 టీ స్పూన్, జీడి పప్పు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), నెయ్యి – 1 టీ స్పూన్.
కొబ్బరి లడ్డూ తయారు చేసే విధానం:
బాణలి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. అనంతరం అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, చక్కెర వేసి బాగా కలిపి ఉడకబెట్టాలి. మిశ్రమంలో తడి అంతా పోయి గట్టిపడుతుంది. అనంతరం అందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి దింపాలి. మిశ్రమం మరింత చల్లారాక లడ్డూల మాదిరిగా చేతులతో ఒత్తుకోవాలి. గాలి చొరబడని డబ్బాల్లో లడ్డూలను నిల్వ చేయాలి. ఇలా చేసిన లడ్డూలు 2 లేదా 3 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటాయి.