Crispy Corn : స్వీట్ కార్న్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ కార్న్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. బరువు పెరగడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, జుట్టును మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో స్వీట్ కార్న్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్, పిజ్జా, సూప్, వివిధ రకాల చిప్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. వీటితో మనం చేసుకోదగిన వంటకాల్లో క్రిస్పీ కార్న్ ఒకటి. క్రిస్పీ కార్న్ కరకరలాడుతూ తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ క్రిస్పీ కార్న్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – పావు టేబుల్ స్పూన్, కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – రెండు టీ స్పూన్స్.
క్రిస్పీ కార్న్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత స్వీట్ కార్న్ ను, ఉప్పును వేసుకుని కలపాలి. వీటిని 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నీరు అంతా పోయేలా ఈ స్వీట్ కార్న్ ను వడకట్టుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ ను వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు మధ్యస్థ మంటపై వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకున్న తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మసాలాను వేయించిన స్వీట్ కార్న్ పై వేసి కలపాలి.
తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి సర్వం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్నీ కార్న్ తయారవుతుంది. బయట రెస్టారెంట్ లలో అధిక ధరలకు కొనుగోలు తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే ఈ క్రిస్పీ కార్న్ ను తయారు చేసుకుని తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ గా వీటిని తినడం వల్ల రుచితో పాటు స్వీట్ కార్న్ ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.