Crispy Fish Fry : చేపలతో చేసే రుచికరమైన వంటకాల్లో చేపల ఫ్రై కూడా ఒకటి. చేపల ప్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి ఈ చేపల ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ లలో కూడా మనకు ఈ చేపల ఫ్రై లభిస్తుంది. రెస్టారెంట్ లలో లభించే విధంగా కలర్ ఫుల్ గా, క్రిస్పీగా ఉండే చేపల ఫ్రైను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ చేపల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం -ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి -ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, సన్నగా కట్ చేసిన చేప ముక్కలు – 750 గ్రా., నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా సన్నగా కట్ చేసిన చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో చేప ముక్కలను వేసి మసాలాలు చక్కగా పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి వేయించాలి. ఈ చేప ముక్కలను మధ్యస్థ మంటపై రెండు వైపులా చక్కగా ఎర్రగా కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడంవల్ల ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా చేసిన చేపల ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.