Custard Fruit Salad : ఎండాకాలంలో మనం ఎక్కువగా చల్లని పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే పదార్థాలు చల్లగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసేవి అయితే మరీ మంచిది. అలాంటి వాటిల్లో ఫ్రూట్ సలాడ్ ఒకటి. ఇది చల్లగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తుంటారు. ఫ్రూట్ సలాడ్ ను తయారు చేయడం కూడా సులభమే. ఎంతో రుచిగా, చల్లగా ఉండే ఫ్రూట్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రూట్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, యాపిల్ ముక్కలు – ఒక పండు, అరటి పండు ముక్కలు – ఒక పండు, దానిమ్మ గింజలు – అర కప్పు, కస్టర్డ్ పౌడర్ – 3 టీ స్పూన్స్, పంచదార – అర కప్పు.
ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను తీసుకుని తగినన్ని పాలను లేదా నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో పాలను తీసుకుని కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరిగిన తరువాత పంచదారను వేసి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు ఉంచి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలను, అరటి పండు ముక్కలను, దానిమ్మ గింజలను వేసి కలిపి ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ సలాడ్ తయారవుతుంది. దీని తయారీలో ఇతర పండ్లను కూడా ఉపయోగించవచ్చు. చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ ను తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.