Daddojanam : మనం ఆహారంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పెరుగులో ఉండే విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యాని చక్కగా ఉంచడంలో సహాయపడతాయి. పెరుగుతో మజ్జిగ, మజ్జిగ చారు వంటి వాటితో పాటు దద్దోజనాన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. ఆలయాల్లో కూడా ప్రసాదంగా దద్దోజనాన్ని ఇస్తూ ఉంటారు. ఈ దద్దోజనాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావ్లసిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దద్దోజనం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, వేడి పాలు – ఒకటిన్నర కప్పు, పెరుగు – 2 కప్పులు, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
దద్దోజనం తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో వేడి పాలు వేసి కలపాలి. తరువాత పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపు వేగిన తరువాత దానిని ముందుగా సిద్దం చేసుకున్న పెరుగన్నంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే దద్దోజనం తయారవుతుంది. పెరుగును తినడం ఇష్టంలేని వారు కూడా ఈ దద్దోజనాన్ని ఇష్టంగా తింటారు. పెరుగుతో ఇలా దద్దోజనాన్ని చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.