Eating Quickly : మనం ప్రతిరోజూ మూడు పూటలా మనకు నచ్చిన వంటకాలను వండుకుని భోజనం చేస్తూ ఉంటాం. భోజనం చేయడం వల్ల మన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినడం తప్పనిసరి. అయితే ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది త్వరగా తినేస్తున్నారు. ఉదయం సమయం తక్కువగా ఉందని సమయం ఆదా అవుతుందని చాలా మంది త్వరత్వరగా భోజనాన్ని తినేస్తున్నారు. ఇలా భోజనం చేయడం వల్ల తినే ఆహారాన్ని ఆస్వాదించలేకపోతారు. అంతేకాకుండా త్వర త్వరగా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.త్వరగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా అని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ నిపుణులు జరిపిన పరిశోధనల్లో త్వర త్వరగా తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది.
త్వర త్వరగా తినడం వల్ల మన శరీరానికి కలిగే హాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా తినడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల తిన్న తరువాత కొద్ది సమయానికే మరలా ఆకలి వేస్తుందని దీంతో మరింత ఎక్కువ ఆహారాన్ని, ఎక్కువ క్యాలరీలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన హార్మోన్ల పని తీరు దెబ్బతింటుందని కూడా వారు చెబుతున్నారు. అదే విధంగా వేగంగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా వేగంగా తినే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వీరి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
అదే విధంగా వేగంగా తినడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు నొప్పి, పొట్టలో వాపు, జీర్ణ సమస్యలు వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేగంగా తినడం వల్ల పొట్టలో ఆహారం ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యల బారిన పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే వివధంగా వేగంగా తినడం వల్ల గొంతు పట్టుకుపోవడం, ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుకనెమ్మదిగా ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ కనీసం భోజనానికి 20 నిమిషాల సమయం కేటాయించాలి. 20 నిమిషాల సమయాన్ని కేటాయించడం వల్ల మన శరీరం మెదడుకు కడుపు నిండిన భావనను కలిగించే సంకేతాలను అందిస్తుంది. దీంతో మనం తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పటికి కడుపు నిండిన భావన కలుగుతుంది.
అలాగే భోజనం చేసే ముందు ఆహారం యొక్క రంగును, రుచిని, వాసనను చూడాలి. అదే విధంగా ఆహారాన్ని చిన్న చిన్న ముద్దల రూపంలో తీసుకుని బాగా నమలాలి. ఇలా నెమ్మదిగా భోజనం చేసినప్పుడే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయని వేగంగా భోజనం చేయడం అస్సలు మంచి పద్దతి కాదని నిపుణులు సూచిస్తున్నారు.