1. సంపాదన – మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు.
2. గొడవలు – మన కుటుంబంలో జరిగే గొడవలు, సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్య, భర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ల దృష్టిలో చులకన కారాదు.
3. వయసు – వయసును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఏదైనా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం మన వయస్సు కరెక్టుగా చెబితే ఆయుష్షు తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు.
4. మంత్రం – మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ, కార్యాలప్పుడు కానీ, మంత్రాన్ని చెప్పేటప్పుడు వినీ వినిపించనట్లు చెవిలో చెబుతాడు.
5. దానం – దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కూడా. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు.
6. సన్మానం – మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పరాదు. ఎందుకంటే మన డప్పును మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్లు చెబితే ఫర్వాలేదు. కానీ మనది మనమే చెప్పుకోరాదు.
7. అవమానం – మనకు ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్లు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది.
8. ఔషధం – మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పరాదు. ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు. పనిచేయకపోవచ్చు. మంచి జరిగితే ఫరవాలేదు. చెడు జరిగితే నువ్విచ్చిన మందు వల్ల నాకీ పరిస్థితి వచ్చిందని అంటారు.
9. ఆస్తులు – మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరి దగ్గరా చర్చించకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా, మనల్ని చూసి అసూయపడే వాళ్లు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు.