Abracadabra : మ్యాజిక్ షోలలో మెజిషియన్లు సాధారణంగా ఏ మ్యాజిక్ ట్రిక్‌ను చేసేటప్పుడైనా.. అబ్రకదబ్ర.. అంటూ మంత్రం చదివినట్లు చదివి ఆ తరువాత తమ మ్యాజిక్ ట్రిక్‌లను ప్రదర్శిస్తుంటారు తెలుసు కదా. అబ్రకదబ్ర అనే దాన్ని ఒక మంత్రంగా వారు చదువుతారు. దీంతో మాయ జరుగుతుందని వీక్షకులు ఊహిస్తారు. అయితే మెజిషియన్లు నిజానికి ఆ పదాన్ని మంత్రంగా ఎందుకు పఠిస్తారు ? అందుకు కారణాలు ఏమిటి ? అసలు అబ్రకదబ్ర అనే పదానికి అర్థమేమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరబిక్ భాషలోని avra kadavra అనే పదం నుంచి Abracadabra అనే పదం పుట్టిందని చెబుతారు. ఇక హెబ్రూ భాషలో దీన్ని ab ben ruach hakodesh అంటారు. ఈ పదం ప్రకారం ab అంటే తండ్రి, ben అంటే కొడుకు అని, ruach hakodesh అంటే దైవాత్మ అని అర్థాలు వస్తాయి. అంటే.. కొడుకుకు తండ్రి దైవంతో సమానమని అర్థం వస్తుంది. ఈ క్రమంలో ఆ పదం చదువుతూ ఆ భాషకు చెందిన వారు తమను రక్షించాలని, ఆరోగ్యం కలగాలని, అదృష్టం వరించాలని దైవం లాంటి తండ్రిని, దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
ఇక అబ్రకదబ్ర అనే పదాన్ని రోమన్లు abraxas అంటారు. అయితే అబ్రకదబ్ర పదం మాత్రం avra kadavra అనే పదం నుంచే వచ్చిందని చాలా మంది చెబుతారు. ఈ క్రమంలో ఆ పదం కాలక్రమేణా మారుతూ Abracadabra గా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెబుతారు. ఇక అబ్రకదబ్ర పదాన్ని ఒకప్పుడు మంత్రగాళ్లు ఎక్కువగా వాడేవారట. దీంతో ఆ పదం అలా వాడుకలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మంత్రగాళ్లు దాదాపుగా లేరు కనుక.. మ్యాజిక్‌లు చేసే మెజిషియన్లు ఆ పదాన్ని అందిపుచ్చుకుని దాన్ని తమ మ్యాజిక్‌ల కోసం వాడడం మొదలు పెట్టారు. అదీ.. Abracadabra పదం వెనుక ఉన్న.. మనకు తెలిసిన కథ..!