Bappi Lahiri : యావత్ భారత సంగీత ప్రియులను బప్పి లహరి శోక సంద్రంలోకి నెట్టి వెళ్లిపోయారు. కరోనా కారణంగా ఆయన ఇటీవల ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ మూగబోయింది. బప్పి లహరి సంగీతం అంటే ఎంతో మందికి ఇష్టం. ఆయన ఫ్యాన్స్ అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బప్పి లహరి అప్పట్లో సంగీతం అందించిన పాటలను చాలా మంది ఆదరిస్తుంటారు. ఇక బప్పి లహరి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. ఆయన వేషధారణ. ఆయన భిన్నమైన శైలిలో కనిపిస్తారు. ముఖ్యంగా ఒంటి నిండా బంగారం ధరించి కనిపిస్తారు. అయితే ఆయనకు బంగారం అంటే ఎందుకు అంత ఇష్టం ? అనే విషయానికి వస్తే..
బప్పి లహరికి ప్రముఖ హాలీవుడ్ సింగర్ ఎల్విస్ ప్రిస్లీ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక ఆయనలా అవుదామని కలలు కనేవారు. అందులో భాగంగానే బప్పి లహరి మ్యూజిక్ డైరెక్టర్ అయి తన కలను నిజం చేసుకున్నారు. ఇక ఎల్విస్ ప్రిస్లీ ఎలాగైతే భిన్న వేషధారణలో కనిపించేవాడో అలాగే తాను కూడా బంగారంతో కనిపిస్తానని చెప్పేవారు. చెప్పినట్లే ఆయన సినీ ప్రపంచంలో సక్సెస్ అయి ఆ విధంగానే బంగారం ధరిస్తూ కనిపించారు.
ఇక బప్పి లహరికి బంగారం అంటే అంత ఇష్టం ఉండేందుకు ఇంకో కారణం కూడా ఉంది. ఆయనకు 1975లో తన జన్మదినం సందర్భంగా తన తల్లి వినాయకుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ను అందజేసింది. ఈ క్రమంలోనే ఆయన అప్పట్లో చేసిన జఖ్మి అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమా చేసినప్పుడల్లా అది హిట్ అవ్వాలని చెప్పి అలా బంగారం ధరించడం మొదలు పెట్టారు. ఆయన తల్లి మరణించాక ఆయన భార్య చిత్రాణి ఆయనకు బంగారు నగలను బహుమతిగా ఇవ్వడం మొదలు పెట్టింది. అలా బప్పి లహరి వద్ద ఉన్న బంగారం క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఆయన ఎల్లప్పుడూ బంగారం ధరించి కనిపించేవారు. బంగారం తనకు లక్‌ను తెచ్చి పెడుతుందని ఆయన భావించేవారు. కనుకనే ఆ నగలను ఎల్లప్పుడూ ధరించేవారు.