Rice : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఉత్తరాది వారు బియ్యాన్ని ఎక్కువగా తినరు. కానీ దక్షిణ భారతదేశ ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మన పెద్దలు దంపుడు బియ్యాన్ని ఎక్కువగా తినేవారు. కానీ మనం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోషకాలు ఏమీ లభించకపోగా.. మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. అందుకనే చాలా మంది తెల్ల అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్‌ను తినడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే బ్రౌన్ రైస్ తినలేని వారు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఆహారాలను అన్నంకు బదులుగా తినవచ్చు. దీంతో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
1. క్వినోవా
అన్నం తినడం మానేద్దామనుకుంటున్న వారికి క్వినోవా ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. దీంతో అనేక పోషకాలు మనకు లభిస్తాయి. క్వినోవాలో మన శరీరానికి అవసరం అయిన ముఖ్యమైన 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు లభిస్తాయి. కనుక అన్నం తినొద్దు అని ఫిక్స్ అయిన వారు రోజూ క్వినోవాను తీసుకోవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
2. గోధుమ రవ్వ
అన్నం మానేసేవారు చాలా మంది గోధుమలతో తయారు చేసిన చపాతీలను తింటుంటారు. అయితే అవి కూడా తినలేం అనుకునే వారు గోధుమ రవ్వను తినవచ్చు. దీంతో ఉప్మా లేదా దాలియా లాగా తయారు చేసుకుని తినవచ్చు. అన్ని కూరగాయలు వేసి వండి దీన్ని తింటే భలే రుచిగా ఉంటుంది. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. గోధుమ రవ్వలో మెగ్నిషియం, మాంగనీస్, ఫోలేట్, ఐరన్, విటమిన్ బి6తోపాలు కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
3. చిరు ధాన్యాలు
రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు.. ఇవన్నీ చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. వీటినే సిరి ధాన్యాలు అని, మిల్లెట్స్ అని అంటారు. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవచ్చు. అన్నంకు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి. వీటిల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. వీటిని పలు విధాలుగా వండుకుని తినవచ్చు. ఇవి భిన్న రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్.. వంటి సమస్యలు ఉన్నవారు వీటిని రోజూ తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
4. బార్లీ
తెల్ల అన్నంకు బదులుగా బార్లీ విత్తనాలను కూడా తీసుకోవచ్చు. వీటిని ఉడకబెట్టి నేరుగా తినవచ్చు. లేదా వీటిని నీటిలో వేసి మరిగించి అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగవచ్చు. బార్లీని తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లకు, అధిక బరువు సమస్యకు ఇవి చక్కగా పనిచేస్తాయి.
5. రైస్ వెరైటీలు
తెల్ల అన్నం తినొద్దని అనుకుంటున్నవారు రైస్‌లో వివిధ రకాల వెరైటీలను ట్రై చేయవచ్చు. బ్రౌన్ రైస్‌తోపాటు బ్లాక్ రైస్, రెడ్ రైస్ కూడా మనకు లభిస్తాయి. ఇవి కూడా అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని కూడా రోజూ తీసుకోవచ్చు. దీంతో ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.