Google Pay : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ భారత్‌లోని తన గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ద్వారా రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఈ సదుపాయం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు పెరిగిన దృష్ట్యా తన వినియోగదారులకు ఈ సౌకర్యం అందించాలని గూగుల్ భావించింది. అందుకనే తన గూగుల్ పే యాప్ లో గరిష్టంగా రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
ఇక గూగుల్ పే వినియోగదారులు తాము వాడుతున్న ఆ యాప్‌లోకి వెళ్లి రుణం పొందవచ్చు. అయితే ఈ రుణం పొందాలంటే వినియోగదారులు మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. అప్పుడే ఈ రుణం పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇక ఈ రుణాన్ని డీఎంఐ ఫైనాన్స్ అనే సంస్థ భాగస్వామ్యంతో గూగుల్ అందిస్తోంది. కనుక పర్సనల్ లోన్ పొందాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు కలిగి ఉంటే వెంటనే ఈ యాప్‌లో రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. దీంతో నిమిషాల్లోనే లోన్ ఇస్తారు.
ఈ సందర్భంగా డీఎంఐ ఫైనాన్స్ కో ఫౌండర్, జాయింట్ ఎండీ శివాశిష్ ఛటర్జీ మాట్లాడుతూ.. దేశంలో కొన్ని కోట్ల మంది గూగుల్ పే యాప్‌ను వాడుతున్నారు. అందరికీ త్వరగా రుణాలను అందించడమే లక్ష్యంగా ఈ సౌకర్యాన్ని అందజేస్తున్నాం. రానున్న రోజుల్లో మా సేవలను మరింత విస్తరిస్తాం.. అని అన్నారు. ఇక ఈ సదుపాయంలో భాగంగా రుణం తీసుకున్నవారు 36 నెలల్లోగా ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.