Dosa Pre Mix Powder : మనం ఉదయం పూట ఎక్కువగా తయారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒకటి. దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మన రుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు రుచిగా ఉన్నప్పటికి దోశ పిండిని తయార చేసుకోవడం కొద్దిగా శ్రమతో, సమయంతో కూడుకున్న పని. అందరికి పిండిని తయారు చేసుకునేంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ముందుగానే దోశ పౌడర్ ను తయారు చేసి పెట్టుకోవడం వల్ల చాలా సులభంగా, ఎటువంటి శ్రమ లేకుండా దోశలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ దోశ పౌడర్ చాలా కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. దోశ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి…అలాగే ఈ పౌడర్ తో దోశలను ఏ విధంగా వేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోశ ప్రి మిక్స్ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, సగ్గు బియ్యం – పావు కప్పు, మెంతులు – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
దోశ ప్రి మిక్స్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మినపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. మినపప్పు చక్కగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలాగే బియ్యం, మెంతులు, సగ్గు బియ్యాన్ని కూడా వేరువేరుగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత వీటన్నింటిని కలిపి జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దోశ పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ తో దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పౌడర్ ను మనకు కావల్సిన మోతాదులో తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి కలపాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని మామూలు దోశ పిండిలా రాత్రి తయారు చేసుకుని ఉదయం దోశలను వేసుకోవచ్చు లేదా ఇందులో కొద్దిగా సోడా ఉప్పును కలిపి అర గంట పాటు నానబెట్టి అప్పటికప్పుడు కూడా దోశలను వేసుకోవచ్చు. ఈ విధంగా దోశ పౌడర్ తో చేసిన చేసిన దోశలు కూడా మామూలు దోశల వలె చాలా రుచిగా ఉంటాయి.ఇలా దోశ పౌడర్ ను తయారు చేసుకుని ఎప్పుడు కాబడితే అప్పుడు దోశలను వేసుకోవచ్చు. ఈ దోశ పౌడర్ తో ఉల్లి దోశ, మసాలా దోశ వంటి వాటితో పాటు గుంత పొంగనాలు, అట్టు, ఊతప్పం వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉండే వారు ఇలా దోశ పౌడర్ ను తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల చాలా సులభంగా, చాలా త్వరగా దోశలను తయారు చేసుకుని తినవచ్చు.