Egg Masala Idli : తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసురకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ మసాలా ఇడ్లీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ మసాలా ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లు ఉండాలే కానీ దీనిని ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండే ఈ ఎగ్ మసాలా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ మసాలా ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత,. నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ మసాలా ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీ కుక్కర్ లో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యే లోపు ఇడ్లీ ప్లేట్ ను తీసుకుని దానికి నూనెను రాయాలి. తరువాత ఇందులో కోడిగుడ్డును పగలకొట్టి వేసుకోవాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ ను కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి. వీటిని పది నిమిషాల పాటు ఉడికించిన తరువాత నెమ్మదిగా తీసుకుని ప్లేట్ లో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత కోడిగుడ్డు ఇడ్లీలను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని మరో వైపుకు తిప్పి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా ఇడ్లీలు తయారవుతాయి. వీటిని నేరుగా అన్నంతో తినవచ్చు లేదా సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా కోడిగుడ్లతో ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.