Instant Veg Pulao : వెజిటేబుల్ పులావ్.. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కూరగాయలతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మనం అప్పుడప్పుడూ వంటింట్లో దీనిని తయారు చేస్తూ ఉంటాం. అచితే చాలా మంది ఈ పులావ్ ను తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాలి అలాగే దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని భావిస్తూ ఉంటారు. కానీ కేవలం 10 నిమిషాల్లోనే ఈ పులావ్ ను మనం తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా వెజిటేబుల్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ వెజిటేబుల్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 200 గ్రా., తరిగిన క్యారెట్ – 2, తరిగిన బీన్స్ – 10, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన టమాట – 1, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉడికించిన బంఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, మరాఠీ మొగ్గ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ.
ఇన్ స్టాంట్ వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెజిటేబుల్ ముక్కలు, బఠాణీ వేసి కలపాలి. వీటిని మధ్యస్థ మంటపై 5 నిమిషాల వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత అన్నం వేసి కలపాలి.
మసాలాలన్నీ అన్నాన్ని పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 3 నిమిషాల పాటు అలాగే ఉంచఇ ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పులావ్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, వంట చేయడానికి సమయం ఎక్కువగా లేనప్పుడు అలాగే లంచ్ బాక్స్ లోకి అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.