Back Pain : వెన్ను నొప్పి. నేటి తరుణంలో చాలా మందిని ఇది బాధిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం గురించి చాలా మంది అంతగా శ్రద్ధ చూపించడం లేదు. ఈ క్రమంలోనే అనేక అనారోగ్య సమస్యలతోపాటు వెన్ను నొప్పి సహజంగా అందరికీ వస్తోంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో కారణం వల్ల ఈ నొప్పి వస్తుంటుంది. అందరికీ ఒకే కారణం ఉండాలని ఏమీ లేదు. అయితే అలాంటి పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వల్లే చాలా మందికి ప్రస్తుతం వెన్ను నొప్పి వస్తోంది. కనుక అవేంటో తెలుసుకుంటే అందుకు తగిన విధంగా జాగ్రత్త పడవచ్చు.
నిత్యం ఎక్కువ బరువున్న వస్తువులను మోసే వారికి వెన్ను నొప్పి సహజంగానే వస్తుంటుంది. బాగా వంగడం, బరువు ఎత్తడం వంటి పనులను పదే పదే చేస్తే వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలో నొప్పి వస్తుంది. నేటి తరుణంలో చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. దీంతో అప్పుడప్పుడు కాదు కదా, కనీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు తీరిక లేకుండా చాలా మంది అలాగే గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. ఇందువల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంది. చాలా మంది యోగా, ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు సరైన భంగిమలో చేయరు. అసహజంగా చేస్తారు. దీని వల్ల కూడా వెన్నెముకపై భారం పడి నొప్పి వస్తుంటుంది.
కంప్యూటర్ లేదా టీవీ ముందు కూర్చునే భంగిమలో తేడా వచ్చినా వెన్ను నొప్పి వస్తుంది. మరీ అంత మెత్తగా లేదా మరీ అంత హార్డ్‌గా ఉన్న పరుపుల మీద నిద్రించకూడదు. దీని వల్ల వెన్నెముకపై ఒత్తిడి కలుగుతుంది. అది వెన్నునొప్పికి దారి తీస్తుంది. గుంతలు పడిన రహదారుల్లో నిత్యం వెళ్లే వాహనదారులకు కూడా వెన్ను నొప్పి వస్తుంది. అలాంటి రోడ్లలో వెళ్తే కలిగే కుదుపులకు వెన్నెముకపై భారం పడుతుంది. ఫలితంగా నొప్పి వస్తుంది. కనుక ఈ సూచనలు పాటిస్తే దాంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. వెన్నెముకపై భారం పడకుండా ఉంటుంది..!