Gongura Chicken : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో గోంగూర చికెన్ కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ ను వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 2 కట్టలు, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అర కిలో, నూనె – అర కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాట – 1 ( పెద్దది), కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
గోంగూర చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత శుభ్రపరుచుకున్న గోంగూరను వేసి కలపాలి. దీనిని మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. గోంగూర ఉడికిన తరువాత చికెన్ ను వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
చికెన్ ఉడికిన తరువాత గరం మసాలా వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ వంటకాలతో పాటు వీకెండ్స్ లో అప్పుడప్పుడూ ఇలా గోంగూర చికెన్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఒక్క ముక్క విడిచి పెట్టకుండా అందరూ ఈ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.