Gongura Mutton : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటాం. గోంగూరలతో మాంసాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన గోంగూర మటన్ కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర మటన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. గోంగూర మటన్ ను ఎక్కువగా హోటల్స్ లో తయారు చేస్తూ ఉంటారు. దీనిని ఇంట్లో కూడా మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. గోంగూర మటన్ ను రుచిగా, సులువుగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర మటన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – ఒక పెద్ద కట్ట, మటన్ – 300 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, దాల్చిన చెక్క – 1, బిర్యానీ ఆకు – ఒకటి, సాజీరా – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – రెండున్నర టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు.
గోంగూర మటన్ తయారు చేసే విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనెను వేసి వేడయ్యాక కడిగిన గోంగూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరాను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత శుభ్రంగా కడిగిన మటన్ తోపాటు తరిగిన టమాట, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పడు మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మటన్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
మటన్ పూర్తిగా ఉడికిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర మటన్ తయారవుతుంది. అన్నం, రోటి, చపాతీ, రాగి సంగటి వంటి వాటితో గోంగూర మటన్ ను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర మటన్ ను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మటన్ తోపాటు గోంగూరలో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు. గోంగూర మటన్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రక్త హీనత సమస్య నుండి బయట పడవచ్చు. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా గోంగూర మటన్ ఎంతో సహాయపడుతుంది.