Gongura Pappu : గోంగూర పప్పు.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. గోంగూరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గోంగూరతో మనం పచ్చడితో పాటు పప్పును కూడా తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. గోంగూర పప్పును అందరూ ఇష్టపడేలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – ఒక పెద్ద కట్ట, కందిపప్పు – 150 గ్రాములు, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్.
గోంగూర పప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో పసుపు, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ పప్పును మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో తరిగిన గోంగూర, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు రసం వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఈ పప్పును మరో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత పప్పును వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.