India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. భారత జట్టు ప్లేయర్లు అందరూ కలసి కట్టుగా ఆడి విజయాన్ని అందించారు. ఈ క్రమంలో విండీస్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో 61 పరుగులతో నికోలాస్ పూరన్ రాణించాడు. అలాగే మరో బ్యాట్స్‌మన్ కైల్ మేయర్స్ కూడా 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌లు చెరో 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 162 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఆకట్టుకోగా.. ఇషాన్ కిషన్ 42 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్‌కు 2 వికెట్లు దక్కగా, షెల్డాన్ కాట్రెల్, ఫేబియన్ అలన్‌లు చెరొక వికెట్ తీశారు. కాగా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి విండీస్‌పై 1-0 ఆధిక్యం సాధించింది. రెండో టీ20 మ్యాచ్ ఇదే వేదికపై ఈ నెల 18వ తేదీన రాత్రి 7 గంటలకు జరగనుంది.