Green Allam Chutney : మన వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన పదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు అల్లంతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలతో పాటు పచ్చి మిరపకాయలతో కూడా మనం అల్లం పచ్చడిని తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే అల్లం పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని కేవలం 5 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 100 గ్రా., అల్లం – 2 ఇంచుల ముక్క, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., బెల్లం – 20 గ్రా., ఉప్పు – తగినంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, నూనె – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
అల్లం చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చిమిర్చి, అల్లం, బెల్లం, చింతపండు, ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పచ్చడిని గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లంతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.