Green Pudina Pachadi : పుదీనా.. ఇది మనందరికి తెలిసిందే. వంటను గార్నిష్ కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. పుదీనా చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వంటల్లో దీనిని వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంటల్లోనే కాకుండా పుదీనాతో పుదీనా రైస్, పుదీనా పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. పుదీనా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులువు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ పుదీనా పచ్చడిని రుచిగా చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే పుదీనాతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా – 4 కట్టలు, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్ , వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండుమిర్చి – 3, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ.
పుదీనా పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చక్కగా వేగిన తరువాత వాటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత పుదీనాను వేసుకుని వేయించాలి. పుదీనా వేగి దగ్గర పడిన తరువాత చింతపండు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత నువ్వుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేవరకు ఉంచాలి. తరువాత దీనిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి అన్నీ వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పుదీనాతో అప్పుడప్పుడు ఇలా పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు పుదీనాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.