Suresh Raina : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సురేష్ రైనా ఎంతటి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడో అందరికీ తెలిసిందే. అతను ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు చాలా సార్లు విజయాలను అందించాడు. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అనేక మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాలను కట్టబెట్టాడు. అయితే కారణాలు తెలియవు కానీ.. సురేష్ రైనాను ఈసారి మెగా వేలంలో చెన్నై తీసుకోలేదు. పలువురు పాత ప్లేయర్లను చెన్నై వెనక్కి తీసుకుంది. కానీ రైనా కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీంతో ఈసారి వేలంలో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.
అయితే రైనాను తీసుకోకపోవడంపై చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ సీఎస్‌కే పేరిట హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీంతో జట్టు యాజమాన్యం స్పందించింది. సురేష్ రైనా ఫిట్‌గా లేడని.. అతన్ని తీసుకుని తాము రిస్క్ చేయలేమని చేతులెత్తేసింది. చాలా సునాయాసంగా రైనాను వదిలించుకుంది. అయితే ఇప్పుడు రైనాకు జాక్ పాట్ తగలనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. గుజరాత్ టైటాన్స్ రైనాను తీసుకుంటుందని తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన జేసన్ రాయ్ ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. బయో సెక్యూర్ బబుల్‌పై అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అతను ఐపీఎల్‌లో ఈసారి ఆడలేనని తెలిపాడు. దీంతో టైటాన్స్‌కు గట్టి దెబ్బ పడింది. అయితే జేసన్ రాయ్ అద్భుతమైన బ్యాట్స్‌మన్ కనుక అతని స్థానాన్ని అతని లాంటి మరొక బ్యాట్స్‌మన్‌తో భర్తీ చేయాలి. అందుకు సురేష్ రైనానే సరైన వాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వారు గుజరాత్ టైటాన్స్‌కు రైనా పేరును హ్యాష్ ట్యాగ్ రూపంలో జోడించి ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో గుజరాత్‌కు రైనా ఆడుతాడని తెలుస్తోంది.
రైనాను ఈసారి వేలంలో రూ.2 కోట్ల కనీస ధరకు వేలంలో ఉంచారు. కానీ ఎవరూ కొనలేదు. దీంతో అంతే మొత్తానికి గుజరాత్ అతన్ని కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. దీంతో గుజరాత్ ఫ్యాన్స్ రైనాను ఆహ్వానిస్తున్నారు. మరి గుజరాత్ అతన్ని తీసుకుంటుందా.. లేదా.. అన్నది చూడాలి.