Lemon Rasam : వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి బారిన పడినప్పుడు నోరు చేదుగా ఉండి ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. అలాంటప్పుడు చాలా మంది నోటికి రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా రసాన్ని చేసుకుని తింటూ ఉంటారు. అయితే రసం తయారీలో మనం ఎక్కువగా చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండుకు బదులుగా మనం నిమ్మ కాయ రసంతో కూడా రసాన్ని తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో రసాన్ని చేసుకుని తినడం వల్ల నీరసం తగ్గడంతో పాటు ఆయా సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. నిమ్మకాయతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయతో రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన టమాట – 1, కరివేపాకు – ఒక రెబ్బ, కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 800 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, ఉడికించి మెత్తగా చేసిన కందిపప్పు – పావు కప్పు, బెల్లం – ఒక చిన్న ముక్క, పసుపు – పావు టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, అల్లం – అర ఇంచు ముక్క.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 1, ఇంగువ – పావు టీ స్పూన్.
నిమ్మకాయతో రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో పచ్చి మిర్చి ముక్కలను, టమాట ముక్కలను, కరివేపాకును, కొత్తిమీరను, ఉప్పును, బెల్లం ముక్కను, ఉడికించిన కందిపప్పును, పసుపును వేయాలి. తరువాత ఇందులోనే నీళ్లను పోసి స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. మనం తీసుకున్న నీళ్ల పరిమాణం తగ్గే వరకు మరిగించాలి. తరువాత మంటను చిన్నగా చేసి అలాగే ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి వేయించాలి. ఇవి వేగుతుండగానే మిరియాలను, అల్లంముక్కను కూడా కచ్చా పచ్చగా దంచి ఇదే కళాయిలో వేసి వేయించాలి.
ఇలా తయారు చేసిన తాళింపును మరుగుతున్న రసంలో వేసి మరో 3 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఈ రసంలో నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. వేడి వేడి అన్నంతో కలిపి ఈ రసాన్ని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు నోటికి రుచిగా ఇలా నిమ్మకాయతో రసాన్ని చేసుకుని తినడం వల్ల ఆయా సమస్యల నుండి త్వరగా ఉపశమనం కూడా కలుగుతుంది.