Instant Chutney Mix : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తినడానికి ఎంతో రుచిగా చట్నీని కూడా తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఉదయం పూట ఈ చట్నీని తయారు చేసుకోవడానికి తగినంత సమయం ఉండదు. చట్నీతో కలిపి తింటేనే మనం చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. ఇలా ఉదయం పూట ఎక్కువగా సమయం లేని వారు ఇన్ స్టాంట్ చట్నీ మిక్స్ ను తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు మనం చాలా తక్కువ సమయంలోనే చట్నీ ని తయారు చేసుకోవచ్చు. మనకు బయట మార్కెట్ లో చట్నీ మిక్స్ దొరికినప్పటికీ అవి అంత రుచిగా ఉండవు. కేవలం 5 నిమిషాల్లోనే చట్నీని తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఈ చట్నీ మిక్స్ ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ చట్నీ మిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, పుట్నాలు – అర కప్పు, మినపగుళ్లు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 8 లేదా తగినన్ని, కరివేపాకు – రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు -ఒక రెబ్బ.
ఇన్ స్టాంట్ చట్నీ మిక్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి కలుపుతూ దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఎండుకొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించి అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును తప్ప మిగిలిన పదార్థాలను కూడా వేయించి అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి మెత్తగా పొడి అయ్యేలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి.
తాళింపు వేగిన తరువాత దానిని ముందుగా తయారు చేసుకున్న చట్నీ మిశ్రమంలో వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ చట్నీ మిక్స్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న చట్నీ మిశ్రమాన్ని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజులకు పైగా తాజాగా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఈ చట్నీ మిశ్రమాన్ని కావల్సినంత పరిమాణంలో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ చట్నీని మనం తయారు చేసుకున్న అల్పాహారంతో కలిపి తినాలి. ఇలా చేసిన చట్నీ మిశ్రమం కూడా చాలా రుచిగా ఉంటుంది.