Rose Plants : మనం అనేక రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటూ ఉంటాము. పూల మొక్కలను చూసినప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్కలు చెట్టు నిండుగా పూలు పూసినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్కలు ఎక్కువగా పూలు పూయాలని మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మొక్కలకు కావల్సిన పోషకాలను చక్కగా అందించినప్పుడు మొక్కలు చక్కగా పెరగడంతో పాటు ఎక్కువగా పూలు పూస్తాయి. ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం రెండంటే రెండు పదార్థాలను ఉపయోగించి మనం మొక్కలు పూలు ఎక్కువగా పూసేలా చేయవచ్చు.
మనకు సులభంగా లభించే అరటి పండ్లు, బెల్లంతో మిశ్రమాన్ని తయారు చేసి మొక్కలకు అందించడం వల్ల మొక్కలు ఎక్కువగా పూలు పూస్తాయి. ఈ పద్దతిని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ( ఎఫ్ ఎఫ్ జె )అని అంటారు. దీని కోసం బాగా పండిన మూడు అరటి పండ్లను, 2 కప్పుల ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో అరటిపండ్లను తొక్కలతో సహా ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం పొడి వేసి చేత్తో బాగా కలపాలి. తరువాత దీనిపై పలుచటి వస్త్రాన్ని ఉంచి అది ఊడిపోకుండా దారంతో కట్టాలి. దీనిని నీడలో గాలి ఎక్కువగా తగిలే చోట ఉంచాలి. అలాగే ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ప్లాస్టిక్ స్పూన్ తో క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిప్పుతూ ఉండాలి. ఇలా వారం నుండి 10 రోజుల పాటు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అరటి పండు, బెల్లం మిశ్రమం బాగా పులిసి చక్కటి ఎరువుగా తయారవుతుంది.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నీటిలో కలిపి తగిన మోతాదులో మొక్క మొదట్లో పోయాలి లేదా దీనిని వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకుని మొక్కలపై అలాగే వేర్ల దగ్గర స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు చక్కగా పెరగడంతో పాటు ఎక్కువ పూలు పూస్తాయి. మొక్క పరిమాణాన్ని బట్టి ఈ నీటిని ఎక్కువగా తక్కువగా పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకు కావల్సిన పొటాషియం, నైట్రోజన్, ఫాస్పరస్ వంటి పోషకాలు చక్కగా అందుతాయి. గులాబి మొక్కలు, మందార వంటి పూల మొక్కలతో పాటు ఇండోర్ మొక్కలకు కూడా ఈ మిశ్రమాన్ని అందించవచ్చు.
అలాగే కూరగాయ మొక్కలకు పూత వచ్చే సమయంలో ఈ ద్రవణాన్ని పిచికారీ చేయడం వల్ల పూత ఎక్కువగా వచ్చి కాయలు ఎక్కువగా కాస్తాయి. అలాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. దీనిని ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవాలనుకునే వారు డజన్ అరటిపండ్లకు కిలో నుండి కిలోన్నర బెల్లాన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే ఈ మిశ్రమాన్ని ఎక్కువగా తయారు చేసుకుని నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఈ విధంగా సహజ సిద్దంగా ఎటువంటి రసాయనాలు, ఫెర్టిలైజర్స్ వాడకుండా మొక్కలను ఎక్కువగా పూలు పూసేలా చేసుకోవచ్చు.