Turmeric : పసుపును మనం ఎంతో కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నాం. పసుపు లేనిదే ఏ వంటకమూ పూర్తి కాదు. మనం రోజూ చేసే కూరల్లో పసుపును తప్పనిసరిగా వేస్తుంటాం. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే పసుపును దివ్యమైన ఔషధంగా కూడా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక ఔషధాల తయారీలో దీన్ని వాడుతారు. ఇక పసుపును తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు మనకు అనేక ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తుంది.
పసుపును తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. వారి శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే పసుపును పాలలో కలిపి రాత్రి పూట తాగితే నిద్ర చక్కగా పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి.
శరీరంలో నొప్పులు, వాపులు ఉన్నవారు రోజూ పసుపును వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో పసుపు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. అలాగే క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో మనకు నకిలీ పసుపు విరివిగా లభిస్తుంది. కానీ ఒక చిట్కాను పాటిస్తే నకిలీ పసుపును మనం సులభంగా గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
కల్తీని గుర్తించడం ఇలా..
పసుపును సాధారణంగా కృత్రిమ రంగులను కలిపి తయారు చేస్తుంటారు. దీనిని గుర్తించాలంటే నీటితో నింపిన రెండు గాజు గ్లాసులను తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న రెండు రకాల పసుపును వేర్వేరు గ్లాసుల్లో ఒక టీస్పూన్ చొప్పున వేయాలి. కల్తీ జరగని పసుపు వేసిన గ్లాసులో నీళ్లు లేత పసుపు రంగులోకి మారుతాయి. పసుపు అడుగు భాగంలో చేరుతుంది. కల్తీ జరిగిన పసుపు నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. నీళ్లు ముదురు పసుపు రంగులోకి మారుతాయి. ఇలా ఈ చిట్కాను పాటిస్తే సులభంగా మీరు వాడుతున్న పసుపు అసలుదా లేక కల్తీ జరిగిందా.. అన్న విషయాన్ని ఇట్టే పసిగట్టవచ్చు.