Pepper Rice : బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి ఎంతో వేగంగా తయారు చేయగలిగే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. ఉదయం ఎక్కువ సమయం లేదనుకునేవారు ఒకేసారి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కోసం ఫుడ్ తయారు చేయవచ్చు. దీన్ని ఎలాగైనా తినవచ్చు. చేయడం కూడా చాలా సులభమే. కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇంతకీ ఆ ఫుడ్ ఏమిటో తెలుసా.. అదేనండీ.. మిరియాల రైస్. అవును, దీన్నే పెప్పర్ రైస్ అని కూడా అంటారు. దీన్ని చాలా ఈజీగా నిమిషాల్లోనే చేయవచ్చు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో, ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 1 కప్పు, నెయ్యి – 2 టీస్పూన్లు, మిరియాలు – 1 టీస్పూన్, జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్, ఎండు మిర్చి – 5, నూనె – 1 టీస్పూన్, ఆవాలు – పావు టీస్పూన్, మినప్పప్పు – 1 టీస్పూన్, శనగపప్పు – 1 టీస్పూన్, పల్లీలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, జీడిపప్పు పలుకులు – పావు కప్పు.
మిరియాల రైస్‌ను తయారు చేసే విధానం..
స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టీస్పూన్ నెయ్యి వేసి మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, మైడు ఎండు మిర్చి వేసి వేయించుకుని తీసుకోవాలి. వేడి పూర్తిగా చల్లారాక మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద మళ్లీ కడాయి పెట్టి మిగిలిన నెయ్యి, నూనె వేయాలి. ఈ రెండూ వేడెక్కాక ఆవాలు, మిగిలిన జీలకర్ర, ఎండు మిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, జీడిపప్పు పలుకులు, పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు కూడా వేయాలి. అన్నీవేగాక ముందుగా చేసుకున్న మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి ఆ తరువాత అన్నం వేసి కలిపి.. 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన మిరియాల రైస్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీ, కూరతోనూ లాగించేయవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.