Pulka : మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఊబకాయం, షుగర్ వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు అన్నానికి బదులుగా పుల్కాలను ఆహారంగా తీసుకోమని చెబుతున్నారు. మనలో చాలా మంది ఇప్పటికే మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో పుల్కాలను తీసుకుంటున్నారు. చుక్క నూనె వేయకుండా చేసే ఈ పుల్కాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఒక్కచుక్క నూనెను కూడా వాడకుండా పుల్కాలు పొంగేలా, అలాగే చాలా సమయం వరకు మెత్తగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – కొద్దిగా.
పుల్కా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ స పిండిని 2 నుండి 3 నిమిషాల పాటు చేత్తో బాగా వత్తుతూ కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. చపాతీలు వీలైనంత గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక చపాతీని వేసి కాల్చుకోవాలి.
చపాతీ కాలి బుడగలు రాగానే దీనిని మరో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి చపాతీని మరో వైపుకు తిప్పకుండా ఒకేవైపు కాల్చుకోవాలి. చపాతీ ఒకవైపు చక్కగా కాలిన తరువాత దీనిని తక్కువగా కాల్చుకున్న వైపు నేరుగా మంటపై లేదా పుల్కా పెనంపై వేసి కాల్చుకోవాలి. చపాతీ చక్కగా పొంగి కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుల్కాలు చక్కగా పొంగుతాయి. అలాగే వీటిని హాట్ బాక్స్ లో ఉంచడం వల్ల చాలా సమయం వరకు మెత్తగా ఉంటాయి. వీటిని ఏ కూరతోనైనా తినవచ్చు. ఇలా చేయడం వల్ల మెత్తగా, రుచిగా ఉండే పుల్కాలను తయారు చేసుకోవచ్చు.