Hyderabadi Style Double Ka Meetha : మనం బ్రెడ్ తో చిరుతిళ్లతో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో డబుల్ కా మీటా కూడా ఒకటి. డబుల్ కా మీటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డబుల్ కా మీటాను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే హైదరాబాదీ స్టైల్ డబుల్ కా మీటా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎంతో కమ్మగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, ఫంక్షన్ లలో లభిస్తుంది. ఈ హైదరాబాదీ స్టైల్ డబుల్ కా మీటాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే హైదరాబాదీ స్టైల్ డబుల్ కా మీటాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ స్టైల్ డబుల్ కా మీటా తయారీకి కావల్సిన పదార్థాలు..
మిల్క్ బ్రెడ్ – 4 స్లైసెస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – 1/3 కప్పు, నీళ్లు – పావు కప్పు, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, పాలు- పావు లీటర్, కండెన్డ్స్ మిల్క్ – పావు కప్పు, మిల్క్ పౌడర్ – పావు కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్స్, తరిగిన డ్రై ప్రూట్స్ – కొద్దిగా.
హైదరాబాదీ స్టైల్ డబుల్ కా మీటా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ కు ఉంచే అంచులను తీసేసి ఒక్కో బ్రెడ్ ను ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గంట పాటు ఎండలో పెట్టాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించిన తరువాత వెడల్పుగా ఉండే మరో కళాయిలో పంచదార, నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగి జిగురుగా అయిన తరువాత ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పాలు పోసి కలపాలి.
తరువాత కండెన్డ్స్ మిల్క్, మిల్క్ పౌడర్ వేసి కలపాలి. ఇవన్నీ చక్కగా కలిసిన తరువాత వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి ఉడికించాలి. వీటిని 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలపాలి. బ్రెడ్ ముద్దగా అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. బ్రెడ్ పాలను పీల్చుకుని పూర్తిగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిపై డ్రై ఫ్రూట్స్ ను చల్లుకోవాలి. తరువాత సిల్వర్ లీఫ్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డబుల్ కా మీటా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.