Weak Moon In Horoscope : అధిక కోపం, మానసిక వేధన, కుటుంబ సభ్యులతో చెడు సంబంధాలు, మితిమీరిన భావోద్వేగం, గందరగోళం, చంచల స్వభావం వంటి సమస్యలతో బాధపడే వారు ఉంటారు. ఇలాంటి వ్యక్తుల జాతకంలో చంద్రుడు చెడు మరియు నీచ స్థితిని సూచిస్తాయి. గ్రహాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. దీంతో చంద్రుడు భూమిపై నివసించే ప్రజలను త్వరగా ప్రభావితం చేస్తాడు. ఈ ప్రభావం ప్రజల మనస్సును, ఆలోచనలను ప్రభావితం చేయడంతో పాటు కీర్తి మరియు ప్రతిష్టను కూడా ప్రభావితం చేస్తుంది. చంద్రుడు శక్తివంతమైన గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వ్యక్తి బలమైన మానసిక స్థితిని కలిగి ఉంటాడు. అతని జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చిన, కష్టాల్లో స్థిరంగా నిలబడి వాటికి పరిష్కారాలను కనుగొంటాడు. కొన్ని రకాల పరిహారాలను, నివారణలను చేయడం వల్ల మనం చంద్రుడిని బలోపేతం చేయవచ్చు. చంద్రుడిని బలోపేతం చేసే నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిరుపేదలకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పేద మహిళలకు సహాయం చేయడం, అనారోగ్యంతో ఉన్న వారికి మందులు అందజేయడం, బట్టలు కొన్నివడం వంటివి చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. మీ మధ్య ఎలాంటి వాదనలు, వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో ఉండే పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. అలాగే వెండి ఉంగరం, వెండి కంకణం వంటి వాటిని ధరించాలి. వెండి పాత్రలల్లో నీటిని తాగడం, ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. దీంతో చంద్రుడు బలపడతాడు. అదే విధంగా పౌర్ణమి రోజున ఆవు పాలల్లో నీటిని కలిపి చంద్రుడుకి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ప్రతిరోజూ చంద్రుడిని దర్శించుకోవాలి. అలాగే ఎప్పుడూ తెల్లటి రుమాలు మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లో తెల్లటి సువానస గల మొక్కలను నాటాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మిఠాయి లేదా చక్కెర తిని వెళ్లాలి. వీటితో పాటు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, పెరుగు, అన్నం వంటి తెల్లటి పదార్థాలను తీసుకోవాలి. చంద్రోదయం తరువాత రాత్రిపూట బరువైన ఆహారాలను తీసుకోకూడదు. ఎక్కువగా పాలతో చేసిన వాటిని తీసుకోవాలి. ఇంట్లో మరియు బయట పిల్లలతో, స్త్రీలతో సక్రమంగా ప్రవర్తించాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల చంద్రుడు బలోపేతం అవుతాడు. మీ ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. ఇలా చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో విజయాలు చేకూరుతాయి.