Instant Rice Idli : మన ఇండ్లలో సహజంగానే రోజూ అనేక ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. మిగిలి పోయిన కూరలను అయితే ఫ్రిజ్‌లో పెట్టుకుని ఇంకో పూట లేదా ఇంకో రోజు తింటారు. కానీ అన్నంను అలా తినలేరు. ఒక రోజు అన్నం మిగిలితే దాన్ని పడేయాల్సిందే. అయితే అలా అన్నాన్ని పడేయాల్సిన పనిలేదు. అన్నంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలను ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఇందుకు పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. పైగా తయారు చేయడం కూడా సులభమే. ఈక్రమంలోనే మిగిలిన అన్నంతో ఇన్‌స్టంట్ ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం ఇడ్లీల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
అన్నం ఇడ్లీలను తయారు చేసే విధానం..
ఒక గంట ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి మిశ్రమాన్ని వేసి ప్లేట్లను కుక్కర్‌లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. దీంతో అన్నం ఇడ్లీలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో అయినా కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి.