Ivy Gourd Fry : మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటితో పలు రకాల వంటలను చేసుకోవచ్చు. అయితే కొందరు దొండకాయలు అంటే ఇష్టపడరు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా దొండకాయ ఫ్రై ని ఒక్కసారి చేసి తింటే చాలు.. మొత్తం లాగించేస్తారు. దొండకాయ ఫ్రై ని ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే సరిగ్గా వస్తుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే దొండకాయ ఫ్రై ని రుచిగా.. కారంగా.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, ఉల్లిపాయలు (సన్నగా తరగాలి) – 1, పచ్చి మిర్చి – 2 (సన్నగా, నిలువుగా కట్ చేయాలి), పసుపు – అర టీస్పూన్, కారం – 1 టీస్పూన్ (కారం రుచిని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు), ధనియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర ఆకులు – కొన్ని (గార్నిష్ కోసం).

దొండకాయ ఫ్రై ని తయారు చేసే విధానం..
ముందుగా దొండకాయలను నీళ్లలో వేసి బాగా కడిగి అనంతరం ఆరబెట్టాలి. అవి పొడిగా అయ్యాక చివర్లు కట్ చేయాలి. అనంతరం వాటిని పలుచని గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి. పాన్ తీసుకుని స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై ఉంచాలి. అందులో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేయాలి. అవి బాగా వేగిన తరువాత కట్ చేసిన దొండకాయ ముక్కలను వేసి వేయించాలి. అనంతరం కాసేపు అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి దొండకాయ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
పాన్ మీద మూత పెట్టి స్టవ్‌ను సన్నని లేదా మీడియం మంటపై ఉంచి దొండకాయలను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. దీంతో అవి మెత్తగా మారుతాయి. తరువాత మూత తీసి వేయించాలి. దొండకాయ ముక్కలు వేగాక అవసరం అనుకుంటే ఇంకాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. అలా వేసి మళ్లీ ఆ ముక్కలు పొడిగా, క్రిస్పీగా మారేంత వరకు వేయించాలి. తరువాత స్టవ్‌ను ఆఫ్ చేసి ఫ్రై మీద కొత్తిమీర ఆకులు చల్లి గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు.