Janapa Pachadi : జనపనారతో అనేక వస్తువులు తయారు చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. జనపనారతో చేసిన ఈ జూట్ బ్యాగులను, ఇతర వస్తువులను మనం వాడుతూనే ఉంటాము. అయితే మనలో చాలా మందికి జనపనార గింజలను ఆహారంగా తీసుకుంటారన్న సంగతి తెలియదు. కానీ వీటిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. జనప గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. బరువు తగ్గడంలో కూడా జనప గింజలు మనకు సహాయపడతాయి. ఇలా అనేక రకాలుగా జనపగింజలు మనకు దోహదపడతాయి. వీటితో మనం రుచికరమైన పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జనప గింజలతో రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జనప పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
జనపనారగింజలు – అరకప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 7, తరిగిన టమాటాలు – 4,ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు- 5, పసుపు – పావు టీ స్పూన్.
జనప పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత జనప గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలను మెత్తగా మగ్గించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా మిక్సీ పట్టుకున్న జనపగింజలు, ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన టమాట, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా తయారు చేసుకున్న పచ్చడిని వేసి కలపాలి. తరువాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జనప పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా జనప గింజలతో చేసిన పచ్చడిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.