Jonna Ambali : అంబలి.. జొన్న పిండితో చేసే అంబలి గురించి మనందరికి తెలిసిందే. దీనిని తాగడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఈ అంబలిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. వేసవికాలంలో తప్పకుండా తాగాల్సిన ఈ జొన్న అంబలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న అంబలి తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – మూడు గ్లాసులు, జొన్న పిండి – ఒక టీ స్పూన్,రాగిపిండి – ఒక టీ స్పూన్, జొన్న రవ్వ – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము -ఒక టీ స్పూన్, చిలికిన పెరుగు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
జొన్న అంబలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతుండగానే మరో గిన్నెలో జొన్న పిండి, రాగి పిండి, జొన్న రవ్వ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. తరువాత ముందుగా కలుపుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత పెరుగు వేసి కలపాలి.
ఒకవేళ అంబలి మరీ చిక్కగా ఉంటే ఈ పెరుగునే మజ్జిగలాగా చేసుకుని కలుపుకోవచ్చు. తరువాత ఈ అంబలిని గ్లాస్ లో లేదా కప్పులో పోసి పై నుండి ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వేసవికాలంలో ఈ అంబలిని తాగడం వల్ల మరింత మేలు కలుగుతుంది.