Watermelon Salad : వేసవికాలంలో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శరీరం చల్లబడుతుంది. సాధారణంగా ఈ పుచ్చకాయను నేరుగా తింటూ ఉంటాము. అలాగే జ్యూస్ తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. ఇవే కాకుండా పుచ్చకాయతో సలాడ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ, కీరదోస కలిపి చేసే ఈ సలాడ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవికాలంలో ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల ఎండ వల్ల ఉపశమనం లభించడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రుచిగా వాటర్ మెలన్ తో సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ మెలన్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుచ్చకాయ ముక్కలు – 200 గ్రా., నిమ్మకాయ – 1, మిరియాల పొడి -అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, ఆలివ్ ఆయిల్ – ముప్పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన కీరదోస – 1, పుదీనా ఆకులు – 15, డ్రై రోస్ట్ చేసిన బాదంపప్పు – కొద్దిగా.
వాటర్ మెలన్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నిమ్మకాయ రసం, మిరియాల పొడి, ఉప్పు, ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత పుచ్చకాయ ముక్కలు, కీరదోస ముక్కలు, పుదీనా ఆకులు, బాదంపప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాటర్ మెలన్ సలాడ్ తయారవుతుంది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు కూడా వేసుకోవచ్చు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా ఈ సలాడ్ ను తినవచ్చు. ఈ సలాడ్ ను తినడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు తిరిగి అందుతాయి. వేసవి కాలంలో ఈ విధంగా వాటర్ మెలన్ సలాడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.