Jonna Buvva : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మన పూర్వీకులు వీటినే ఎక్కువగా ఆహారంగా తీసుకునే వారు కనుకనే వారు ఆరోగ్యంగా, బలంగా ఉండేవారు. జొన్నలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా, బలంగా ఉండవచ్చు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు జొన్నల్లో ఉన్నాయి. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా ఉంటాయి. అలాగే జొన్నల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలు చక్కటి ఆహారమే చెప్పవచ్చు. ఈ జొన్నలతో మనం రొట్టెలు, సంగటి, దోశ, ఉప్మా వంటి వాటిని తయారు చేసుకోవచ్చు. జొన్నలతో చేసే సంగటి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా చాలా తేలికగా జొన్న సంగటిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు జొన్న సంగటిని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుకుండా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
సులభంగా, రుచిగా జొన్న సంగటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు జొన్నలను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 10 నుండి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత జొన్నలను వడకట్టి ఒక కాటన్ వస్త్రంపై పోసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అయితే ఫ్యాన్ గాలికి, ఎండకు ఉంచి జొన్నలను ఆరబెట్టుకోకూడదు. జొన్నలు తడి ఆరిన తరువాత వాటిని జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ జొన్నలను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జొన్నల మిశ్రమంలో ఒక కప్పు నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో 4 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత మంటను చిన్నగా చేసి కలిపి పెట్టుకున్న జొన్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి ఉడికించాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. జొన్న సంగటిని కొద్దిగా చేతిలోకి తీసుకుని నలిపి చూస్తే పూర్తిగా మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జొన్న సంగటి దగ్గర పడినప్పటికి ఉడకకపోతే వేడి నీటిని పోసి కలిపి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జొన్న సంగటి తయారవుతుంది. దీనిని నేరుగా అన్నంలా ఇలాగే తినవచ్చు లేదా సంగటి గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చేసుకోనైనా తినవచ్చు. ఇలా తయారు చేసుకున్న జొన్న సంగటిని కూర, పప్పు, పచ్చడి ఇలా దేనితోనైనా కలిపి తినవచ్చు. ఈ విధంగా జొన్నలతో సంగటిని తయారు చేసుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు వాటవ బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.