Jowar Khichdi : మనం జొన్నలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. జొన్నలను పిండిగా, రవ్వగా చేసి మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసుకోదగిన ఆరోగ్యకరమైన వంటకాల్లో జొన్న కిచిడీ కూడా ఒకటి. జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. అల్పాహారంగా, డిన్నర్ లో కూడా దీనిని తీసుకోవచ్చు. ఈ కిచిడీని తయారు చేయడం చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, లవంగాలు – 4, దాల్చిన చెక్క- ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పచ్చి బఠాణీ – అర కప్పు, క్యారెట్ ముక్కలు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, 4 గంటల పాటు నానబెట్టిన పెసర్లు – పావు కప్పు, నీళ్లు – 4 కప్పులు, ఉప్పు – తగినంత, 6 గంటల పాటు నానబెట్టిన జొన్న రవ్వ – ఒక కప్పు.
జొన్న కిచిడీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత బఠాణీ, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత పెసర్లు వేసి కలిపి మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత జొన్న రవ్వ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై రవ్వ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అవసరమైతే మరికొద్దిగా నీళ్లను పోసి మెత్తగా ఉడికించుకోవాలి. చివరగా మరో టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న కిచిడీ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.