Kakarakaya Fry : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కాకరకాయలతో ఎక్కువగా తయారు చేసే వంటకాల్లో కాకరకాయ ఫ్రై ఒకటి. కాకరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కాకరకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ ఫ్రై చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. కాకరకాయలను తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – 3, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, శనగపిండి – 2టీ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కాకరకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత వీటి లోపల ఉండే గింజలను తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు పక్కకు ఉంచిన తరువాత శనగపిండి, బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని చల్లుకుంటూ పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక్కొక్కటిగా కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి.
కాకరకాయ ముక్కలను మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిలో వేయించిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ప్రై తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.