Kakarakaya Ullikaram : కాకరకాయ ఉల్లికారం.. కాకరకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చేదు లేకుండా, రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది. కాకరకాయలు తినని వారు కూడా ఈ ఉల్లికారాన్ని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎవరైనా కూడా దీనిని చేదు లేకుండా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. చేదు లేకుండా రుచిగా ఉండేలా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత కాకరకాయలు – 400గ్రా., పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావుకిలో, కారం – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 8, నూనె – పావు కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ.
కాకరకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి వాటిని రెండు ఇంచుల ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిపై ఉప్పు, పసుపు వేసి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత కాకరకాయ ముక్కలను చేత్తో గట్టిగా పిండుతూ నీటిని తీసి వేయాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి 5 నుండి 6 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వాటి లోపల ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత ఈ కాకరకాయ ముక్కలల్లో ఉల్లిపాయ కారాన్ని స్టఫ్ చేసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని మరలా నూనెలో వేసి వేయించాలి. ఇందులోనే ఎక్కువగా మిగిలిన ఉల్లిపాయ కారాన్ని కూడా వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై 18 నుండి 20 నిమిషాల పాటు వేయించి కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేవిధంగా కాకుండా మరింత రుచిగా ఇలా కాకరకాయ ఉల్లికారాన్ని కూడా తయారు చేసి తీసుకోవచ్చు.