Kakarakaya Uragaya : కాకరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూ వేపుడు, కూర, పులుసు వంటి వాటినే కాకుండా కాకరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే ఊరగాయలను కూడా పెట్టుకోవచ్చు. ఈ ఊరగాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ ఊరగాయను తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ పచ్చడిని సంవత్సరమంతా నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఊరగాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – 300 గ్రా., వేడి నీళ్లు పోసి నానబెట్టిన చింతపండు – 50 గ్రా., నూనె – 350 గ్రా. నుండి 400 గ్రా., ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం తురుము – 2 లేదా 3 టీ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, మెంతులు -ఒక టేబుల్ స్పూన్, కారం – అర కప్పు, ఉప్పు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, పసుపు – ఒక టేబుల్ స్పూన్.
కాకరకాయ ఊరగాయ తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో నానబెట్టిన చింతపండును నీటితో సహా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మరీ కరకరలాడే వరకు కాకుండా ముక్కల్లో ఉండే నీరంతా పోయి ముక్కలు మగ్గే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
ఇవన్నీ వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఇంగువ, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపు పూర్తిగా చల్లారిన తరువాత ఒక గిన్నెలో మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం, మెంతి పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు పలుసు వేసి కలపాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. ఈ పచ్చడిపై మూత పెట్టి 3 రోజుల పాటు ఊరబెట్టాలి. తరువాత ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఊరగాయ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.