Kala Jamun : కాలా జామున్.. స్వీట్ షాపుల్లో దొరికే వంటకాల్లో ఇవి ఒకటి. కాలా జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. స్వీట్ షాపుల్లో లభించే విధంగా అదే రుచితో వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాలా జామున్ లను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, చక్కగా ఈ కాలా జామున్ లను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలా జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోవా – 100 గ్రా., పంచదార – 200 గ్రా., మైదా పిండి – 70 గ్రా., బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, బేకింగ్ సోడా – చిటికెడు,యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కాలా జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోవాను తీసుకుని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత మైదా పిండిని, బేకింగ్ సోడాను, బేకింగ్ పౌడర్ ను, కొద్దిగా నీటిని పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత గిన్నెలో పంచదారను వేయాలి. ఒక కప్పు పంచదారకు ఒకటిన్నర కప్పు నీళ్ల చొప్పున వేసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత దీనిని కొద్దిగా బంకగా అయ్యే వరకు10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పంచదార పాకంలో యాలకుల పొడి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కోవా మిశ్రమాన్ని తీసుకుని మరోసారి కలపాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని జామున్ ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జామున్ లను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ నల్లగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత వాటిని బయటకు తీసి ముందుగా తయారు చేసుకున్న పంచదార మిశ్రమంలో వేయాలి. ఈ జామున్ లను పంచదార మిశ్రమంలో రెండు గంటల పాటు ఉంచి ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాలా జామున్ లు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా వీటిని తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.