Kalyana Rasam : మనం వంటింట్లో కూరలతో పాటు వివిధ రకాల రుచుల్లో రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, నోటికి కమ్మగా ఉండేలా తయారు చేసుకోగలిగే వాటిలో కళ్యాణ రసం కూడా ఒకటి. ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని అన్నంతో కలిపి తింటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కళ్యాణ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్యాణ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కందిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, తరిగిన టమాట – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 4, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా.
కళ్యాణ రసం తయారీ విధానం..
ముందుగా రోట్లో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు వేగిన తరువాత కందిపప్పు, చింతపండు రసం, కరివేపాకు, దంచుకున్న మసాలా, రెండు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. తరువాత వీటిని పది నిమిషాల నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కళ్యాణ రసం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా కళ్యాణ రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇలా రసాన్ని తయారు చేసుకుని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు.