Lakshmi Gavvalu : ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు, టెంపుల్ రన్లు, క్యాండీ క్రష్‌లు, పోకిమాన్ గోలు వచ్చాయి కానీ ఒకప్పుడు మనం కూర్చుని ఆడిన ఆటలు మీకు గుర్తున్నాయా..? అదేనండీ అష్టాచెమ్మా, పులి మేక ఆటలు. అవును. అయితే ప్రధానంగా అష్టా చెమ్మా ఆటలో ఎత్తు వేసేందుకు మనం ఎక్కువగా ఉపయోగించినవి.. అవేనండీ గవ్వలు. అయితే ఆ గవ్వల్లోనే లక్ష్మీ దేవి గవ్వలు కూడా ఉన్నాయట. వాటిని దగ్గర పెట్టుకుంటే సిరి సంపదలు బాగా కలుగుతాయట. అవునా, అని ఆశ్చర్యపోకండి. వాటి గురించి తెలుసుకోండి.
ఒకప్పుడు దేవుళ్లకు, రాక్షసులకు మధ్య వైరం వచ్చి ఇద్దరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు గుర్తుందా..? అవును, ఆ సమయంలోనే ఈ లక్ష్మీ గవ్వలు ఉద్భవించాయట. అప్పటి నుంచి వాటిని ఉపయోగించి అందరూ పూజలు చేస్తున్నారు. దీంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వారు నమ్ముతున్నారు. డబ్బు లేని వారు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని చెబుతుంటే విన్నారు కదా. అవును, అది కరెక్టే. ఎందుకంటే ఒకప్పుడు ఈ లక్ష్మీ గవ్వలను డబ్బుకు బదులుగా ఉపయోగించేవారట. కానీ అవి కాలక్రమేణా తక్కువైపోయాయి. అయితే ఆ లక్ష్మీ గవ్వలను పూజ మందిరంలో ఉంచి పూజిస్తే నిజంగానే లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. అంతేకాదు, ఆ గవ్వలతోపాటు శంఖువును కూడా ఉంచితే ఇంకా మంచిదట.
లక్ష్మీ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు, సుఖ సంతోషాలు దండిగా ఉంటాయట. వీటిని ఇంట్లోని బీరువాల్లో, షెల్ఫ్‌లలో, లాకర్లలో పెట్టుకుంటే చాలా మంచిదట. దీపావళి రోజున ఈ గవ్వలతో ఆటలు ఆడితే చాలా మంచిదట. లక్ష్మీ దేవి తనంతట తానుగా వచ్చి సిరి సంపదలను ఇస్తుందట. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా ఈ గవ్వలు ఉంటాయట. కొన్ని ప్రాంతాల్లో ఈ గవ్వలను ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ప్రచారంలో ఉందట. చిన్న పిల్లలకు మెడలో లేదా మొలలో ఈ గవ్వలను కడితే దృష్టి దోషం కలగదట. దృష్టి దోషం లేకుండా ఉండాలంటే వాహనాలకు కూడా ఈ గవ్వలు కట్టవచ్చట.
భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఈ గవ్వలు కడితే దృష్టి దోషం రాదట. అదేవిధంగా ఇంటి నిర్మాణం అయిన తరువాత గృహ ప్రవేశం చేసే సమయంలో ఒక గుడ్డలో లక్ష్మీ గవ్వలను వేసి కట్టి గుమ్మానికి కడితే లక్ష్మీదేవిని ఆ కొత్త ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుందట. పసుపు రంగు వస్త్రంలో ఈ గవ్వలను కట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్ర నామాలతో కుంకుమార్చన చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం కలిగి ధనం ఆకర్షించబడుతుందట. వ్యాపారస్తులు డబ్బులు పెట్టే క్యాష్ కౌంటర్లలో డబ్బులకు తగిలేలా ఈ గవ్వలను ఉంచుకుంటే ధనం మిక్కిలిగా వస్తుందట.
పెళ్లి కాని వారు ఈ గవ్వలను దగ్గర ఉంచుకుంటే త్వరగా పెళ్లి అవుతుందట. అదే విధంగా వివాహం చేసుకునేటప్పుడు వధూ వరుల చేతికి ఈ గవ్వలను కడితే నరదృష్టి ఉండదట. కాపురం కూడా సజావుగా సాగుతుందట. ఈ గవ్వలు గల గలలాడుతూ ఉన్న చోట లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఉంటుందట. ఇంతకీ ఈ లక్ష్మీ గవ్వలు ఎలా ఉంటాయో చెప్పలేదు కదా..! పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి.