Kerala Paratha : కేరళ పరోటాలు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. రెస్టారెంట్ లలో, ధాబాలలో, స్ట్రీట్ ఫుడ్ లో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మసాలా కూరలతో, కుర్మా వంటి కూరలతో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ పరోటాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం సమయం ఉంటే చాలు ఈ పరోటాలను సులభంగా తయారు చేసుకోవచ్చు. కేరళ పరోటాలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, బొంబాయి రవ్వ – 2 టీ స్పూన్స్, నీళ్లు -ఒక కప్పు, గోధుమపిండి – అర కప్పు, మైదాపిండి – అర కప్పు.
కేరళ పరోటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పంచదార, ఉప్పు, రవ్వ, నీళ్లు పోసి పంచదార కరిగే వరకు కలపాలి. తరువాత గోధుమపిండి, మైదాపిండి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. దీనిని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత పిండిని రెండు భాగాలుగా చేసి పైన నూనెను రాసుకోవాలి. ఈ పిండిపై వస్త్రాన్ని కప్పి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక పిండి ఉండను తీసుకుని నూనె రాసిన ఫ్లోర్ పై ఉంచి వీలైనంత పలుచగా చపాతీ కర్రతో వత్తుకోవాలి. తరువాత దీనిపై రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత పైన కొద్దిగా గోధుమపిండిని లేదా మైదాపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఈ పరోటాకు కత్తితో సన్నగా గాట్లు పెట్టుకోవాలి.
తరువాత కత్తితోనే లేయర్స్ ను ఒక దాని మీద ఒకటి వేస్తూ చుట్టుకోవాలి. తరువాత దీనిని రోల్ లాగా చుట్టుకుని నూనె రాసిన ఫ్లోర్ మీద ఉంచి చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరాటాలను ఒక దాని మీద ఒకటి ఉంచి బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటాలు పొరలు పొరలుగా విడిపోతుంది. ఈ వీటిని వెజ్ లేదా నాన్ వెజ్ మసాలా కూరలతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా మెత్తగా ఉండే కేరళ పరోటాలు తయారవుతాయి. వీటిని ఒకటి తింటే చాలు కడుపు నిండి పోతుంది.