Korrala Halwa : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొర్రలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా కొర్రలు మనకు సహాయపడతాయి. కొర్రలతో ఎక్కువగా అన్నం, దోశ, ఇడ్లీ వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. వీటితో పాటు కొర్రల రవ్వతో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను తయారు చేయడం చాలా సులభం. బెల్లం, కొర్రల రవ్వతో చేసే ఈ హల్వాను తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. రుచిగా, ఎంతో కమ్మగా ఉండే ఈ మిల్లెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్రల రవ్వ – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – అర కప్పు, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.

మిల్లెట్ హల్వా తయారీ విధానం..
ముందుగా రవ్వను శుభ్రంగా కడిగి నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. ఈ రవ్వ సగం వేగిన తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించాలి. రవ్వను ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి రవ్వ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తరువాత బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగి రవ్వ మరింత దగ్గరయ్యే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. హల్వా నుండి నెయ్యి పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా కొర్రలతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ హల్వాను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.