Special Veg Fried Rice : మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడూ వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేస్తూ ఉంటాము. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు , పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను మనం మరింత కలర్ ఫుల్ గా కూడా తయారు చేయవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, అన్నం తినడానికి మారం చేసే పిల్లలకు ఇలా కలర్ ఫుల్ గా వెజ్ ఫ్రైడ్ రైస్ ను చేసి పెట్టవచ్చు. మరింత కలర్ ఫుల్ గా, రుచిగా వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – 2 టీ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన బీన్స్ – 4, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – అర కప్పు, తరిగిన క్యారెట్ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా తరిగిన పర్పుల్ కలర్ క్యాబేజి తురుము – ఒక కప్పు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి -ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, పచ్చిబఠాణీ – పావు కప్పు, అన్నం – రెండు కప్పుల బియ్యంతో వండినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, పచ్చి బఠాణీ, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యాబేజి తురుము వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పెషల్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ ఫ్రైడ్ రైస్ చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా పిల్లలకు ఇలా కలర్ ఫుల్ గా కూడా ఫ్రైడ్ రైస్ ను తయారుచేసి పెట్టవచ్చు.