Kova Burfi : స్వీట్లు తినడం అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి అభిరుచులకు తగినట్లుగా అనేక రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది స్వీట్లను బయట షాపుల్లో కొని తింటారు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోని వెరైటీ స్వీట్లు బయటే లభిస్తాయి. కనుక స్వీట్ షాపుల్లో లభించే స్వీట్లను కొంటుంటారు. అయితే అలాంటి స్వీట్లలో కోవా బర్ఫీ కూడా ఒకటి. ఇది మనకు స్వీట్ షాపుల్లో లభిస్తుంది. ఎంతో రుచిగా ఉంటుంది. కానీ కాస్త శ్రమిస్తే దీన్ని మనం ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవా బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోవా – అర కప్పు, మైదా – అర కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్, యాలకుల పొడి – పావు టీస్పూన్, నూనె – వేయించేందుకు సరిపడా, చక్కెర – ఒక కప్పు, నెయ్యి – 2 టీస్పూన్లు, సోంపు – అర టీస్పూన్.
కోవా బర్ఫీని తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో చక్కెర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కాస్త మందంగా వత్తుకుని ఆ తరువాత బిళ్లల్లా కోసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి చక్కెర వేసి పావు కప్పు నీళ్లను పోయాలి. చక్కెర కరిగి లేత పాకం వస్తున్నప్పుడు దింపేయాలి. వేయించుకున్న కోవా బిళ్లల్ని ఇందులో వేసి వాటికి పాకం పట్టే వరకు ఉంచి తరువాత తీసేయాలి. దీంతో ఎంతో రుచికరమైన కోవా బర్ఫీలు రెడీ అవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా కనుక చేస్తే ఈ బర్ఫీలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టపడతారు.