Laddu For Anemia : మనలో చాలా మంది రక్తహీనత, నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. రక్తహీనతను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దీని నిర్లక్ష్యం చేయడం వల్ల మనం అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మన ఇంట్లో ఉండే పదార్థాలతో లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. బరువు పెరగాలనుకునే వారు ఈ లడ్డూలను తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అలాగే ఈ లడ్డూలను షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా తినవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, గింజలు తీసేసిన ఎండు ఖర్జూరాలు – ఒక కప్పు, బాదం పప్పు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, పుచ్చకాయ గింజలు – పావు కప్పు, గుమ్మడి గింజలు – పావు కప్పు, యాలకులు – 4, గోధుమపిండి – అర కప్పు, నెయ్యి – అర కప్పు, బెల్లం తురుము – అర కప్పు.
లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండుకొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఖర్జూరం ముక్కలను వేసి పొడిగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ను, యాలకులను వేసి మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నింటిని ఒక కళాయిలో వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో గోధుమపిండి వేసి వేయించాలి. గోధుమపిండిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ వేయించాలి. గోధుమపిండి రంగు మారి పలుచగా అయ్యే వరకు నెయ్యి వేస్తూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి కలపాలి.
తరువాత అదే కళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం ఉండలు లేకుంగా పూర్తిగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని కూడా లడ్డూ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత మిగిలిన నెయ్యిని కూడా వేసి కలపాలి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలిపిన తరువాత వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.