Garam Masala Podi : మనం వంటింట్లో అనేక రకాల మసాలా కూరలను వండుతూ ఉంటాం. ఈ కూరలు రుచిగా ఉండడానికి వాటిల్లో మనం గరం మసాలా పొడిని వేస్తూ ఉంటాం. గరం మసాలా పొడిని వేయడం వల్ల కూరలు చక్కని వాసనతో రుచిగా ఉంటాయి. మనకు బయట మార్కెట్ లో వివిధ రకాల గరం మసాలా పొడులు దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే గరం మసాలా పొడిని ఉపయోగించడం వల్ల వంటలు అంత రుచిగా ఉండవు. వాటిని కల్తీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే గరం మసాలా పొడిని చాలా సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గరం మసాలా పొడిని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గరం మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క ముక్కలు – 30 ( అర ఇంచు పరిమాణంలో ఉన్నవి), లవంగాలు – 30, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 10, అనాస పువ్వు – 1, ధనియాలు – అర కప్పు, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్.
గరం మసాలా పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో దాల్చిన చెక్క ముక్కలను, లవంగాలను వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత మిరియాలను, యాలకులను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత అనాస పువ్వును, ధనియాలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత జీలకర్రను వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా సాజీరాను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్నీ చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
తరువాత వీటన్నింటనీ ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కని సువాసనను కలిగి ఉండే గరం మసాలా పొడి తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం వరకు వాసన పోకుండా తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని వెజ్ తో పాటు నాన్ వెజ్ వంటకాలలో కూడా వేయవచ్చు. దీనిని వంటల తయారీలో వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుంది.