Masala Vada : మనలో చాలా మంది సాయంత్రం సమయాల్లో ఏదో ఒక చిరుతిండిని తింటూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో త్వరగా చేసుకోవడానికి వీలుగా ఉండే చిరుతిళ్లల్లో మసాలా వడలు కూడా ఒకటి. ఇవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి. అచ్చం బయట దొరికే విధంగా ఉండే మసాలా వడలను మనం ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. మసాలా వడలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పప్పు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 3 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, గరం మసాలా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మసాలా వడ తయారీ విధానం..
ముందుగా శనగ పప్పును ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత శనగపప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చి మిర్చిని, ఉప్పును, అల్లం ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న శనగ పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె బాగా వేడయ్యే వరకు ఉంచాలి. నూనె వేడయ్యాక తగిన పరిమాణంలో పిండిని తీసుకుని గారెల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ గారెలను మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా వత్తుకోవాలి. ఈ గారెలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. సాయంత్రం సమయాలలో శరీరానికి హాని చేసే చిరు తిళ్లను తినడానికి బదులుగా ఈ విధంగా శనగ పప్పుతో మసాలా వడలను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.